
అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ జనసమితి ఘోరపరాజయం పాలవడం ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకుగా పాల్గొన్న కోదండరాం ప్రజలు తనను, తన పార్టీని తప్పకుండా ఆదరిస్తారని బలంగా నమ్మారు. కానీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి సిఎం కేసీఆర్తో పోరాడటాన్ని ప్రజలు అంగీకరించలేదని అసెంబ్లీ ఎన్నికలతో మరోసారి రుజువైంది. కనుక ఈ ఓటమిని జీర్ణించుకోవడం ఆయనకు కష్టమే కానీ కొన్ని నెలల తరువాత మళ్ళీ తేరుకొని కేసీఆర్ సర్కారుపై తన పోరాటాలు ప్రారంభించారు.
అయినా ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మునిసిపల్ ఎన్నికలలో మరోసారి నిరూపించబడటంతో కోదండరాం చేస్తున్న పోరాటాలకు అర్ధం లేకుండాపోయింది. దాంతో కొంతకాలంగా ఆయన రాష్ట్ర రాజకీయాలలో ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.
అయితే మంచి పోరాటస్పూర్తి కలిగిన ప్రొఫెసర్ కోదండరాం పట్టు వదలని విక్రమార్కుడిలాగ మళ్ళీ మరోసారి కేసీఆర్ సర్కారుపై పోరాటాలకు సిద్దం అవుతున్నారు. ఈసారి నిరుద్యోగసమస్యపై పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ యువజన విభాగం అధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ సదస్సులో కోదండరాం మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ ఎన్నికల హామీలను అమలుచేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగభృతి హామీలను అమలుచేయలేదు. ఇక ఉద్యోగాల కల్పన ప్రస్తావనే చేయడం లేదు. కనుక నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగసమస్య పరిష్కారానికి మళ్ళీ పోరాడక తప్పని పరిస్థితులు ప్రభుత్వమే కల్పించింది. రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో 10 మందితో నిరుద్యోగ కమిటీలు ఏర్పాటు చేసుకొని, ర్యాలీలు, నిరాహారదీక్షలతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదాము. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే హైదరాబాద్లో భారీ బహిరంగసభ నిర్వహించి అసెంబ్లీని ముట్టడిద్దాము,” అని అన్నారు.
నిరుద్యోగ భృతి, పంటరుణాల హామీలను అమలుచేయకపోయినా ప్రజలు సిఎం కేసీఆర్వైపే ఉన్నప్పుడు ప్రొఫెసర్ కోదండరాం వాటి కోసం పోరాటాలు చేసినా ఎమ్మెల్యేలు ప్రయోజనం ఉంటుంది?