దేశరాజధాని డిల్లీలో గత రెండు రోజులుగా జరుగుతున్న సీఏఏ అనుకూల వ్యతిరేక ఘర్షణలలో ఇప్పటి వరకు 13 మంది చనిపోగా పోలీసులు, భద్రతాదళాలతో సహా మొత్తం 186 మంది గాయపడ్డారు. ఈశాన్య డిల్లీలోని చాంద్‌బాగ్, భజన్‌పురా, మౌజ్‌పురా, జాఫ్రాబాద్ ప్రాంతాలలో మంగళవారం కూడా అల్లర్లు, విధ్వంసం జరుగడంతో డిల్లీ పోలీస్ స్పెషల్ కమీషనర్‌గా నియమితులైన ఎస్ఎన్ శ్రీవాత్సవ ఆ ప్రాంతాలలో రోడ్లపై ఎవరైనా కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీచేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిల్లీలో పర్యటిస్తున్నప్పుడు హటాత్తుగా మొదలైన ఈ అల్లర్లను కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశ్యంతోనే ఎవరో ఈ కుట్రకు పాల్పడిఉండవచ్చునని అనుమానిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ అల్లర్లకు పాల్పడినవారిని, వారి వెనుకున్నవారిని కూడా విడిచిపెట్టబోమని అన్నారు. డిల్లీ అల్లర్ల గురించి చర్చించేందుకు ఇవాళ్ళ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గ సమావేశం జరుగనుంది. దానిలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.