3.jpg)
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఇద్దరూ నకిలీ పత్రాలను సృష్టించి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో గోపనపల్లి గ్రామంలో రూ.150 కోట్లు విలువైన 6 ఎకరాల భూములను తమ పేర్లపైకి బదిలీ చేయించుకున్నారని జిల్లా కలెక్టర్ విచారణలో తేలింది. ఆ నివేదికను తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌కు అందజేసారు. ఈ అక్రమ భూవ్యవహారంలో రేవంత్ రెడ్డి సోదరులకు సహకరించిన తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూ అధికారుల సమాచారం ప్రకారం... గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్:127లో మొత్తం 10.21 ఎకరాల పట్టాభూమి ఉంది. కానీ దాని యజమాని ఎవరనేది రికార్డులలో సరిగ్గాలేకపోవడంతో తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సాయంతో దానిలో క్రమంగా మార్పులు చేర్పులు చేసి, దానిలో 6 ఎకరాల 20 కుంటాల భూమిని కళావతి, అలీసలీమ్ బిన్, హబీబ్ అబ్దుల్ రహీమ్, ఏ వెంకట్రావు అండ్ సన్స్ కొనుగోలు చేసినట్లు రికార్డులలో చూపించారు. ఆ తరువాత వారి నుంచి ఆ భూమిని రేవంత్ రెడ్డి సోదరులు కొనుగోలు చేసి తహశీల్దార్ సహకారంతో రికార్డులలో కూడా ఆ భూమిని తమ పేరిట మార్చుకున్నారు.
కానీ రూ. 150 కోట్లు విలువచేసే ఆ భూముల బదిలీలో అక్రమాలు జరిగాయంటూ 2015లో అనీల్ కుమార్ అనే వ్యక్తి రంగారెడ్డి సివిల్ కోర్టులో ఓ పిటిషన్ వేయగా, 2017లో కొల్లా అరుణ అనే మహిళతో సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి సోదరులు పొందిన విలువైన ఆ భూములను వారు అమ్ముకోకుండా స్టే విధించాలని వారు కోరారు.
దాంతో రెవెన్యూ అధికారులు విచారణ జరుపగా రికార్డులలో సదరు భూయజమాని ‘లక్ష్మయ్య’ పూర్తిపేరు నమోదు కాకపోవడంతో, రేవంత్ రెడ్డి సోదరులు తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సాయంతో ఈ కధ అంతా నడిపించినట్లు విచారణలో తేలింది. దీనిపై కలక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ తదుపరి చర్యలు తీసుకొనున్నారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సోదరులు ఇంకా స్పందించవలసి ఉంది.