చేర్యాలలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిరాహారదీక్ష

భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈరోజు హటాత్తుగా చేర్యాలలో నిరాహారదీక్షకు కూర్చోన్నారు. చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు 24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఆయన భువనగిరి నుంచి పట్టణం చేరుకోగానే ముందుగా కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వెళ్ళి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తరువాత పాత బస్టాండ్ చేరుకొని నిరాహార దీక్షకు కూర్చోన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర సాధనలో చేర్యాల ప్రజలు ముందున్నారు. బైరాన్‌పల్లిలో ఒకేరోజు అనేకమంది బలిదానాలు చేసుకున్నారు. అటువంటి చేర్యాల పట్టణం పట్ల సిఎం కేసీఆర్‌కు చిన్న చూపు ఎందుకో అర్ధం కావడంలేదు. ఇకనైనా చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. చేర్యాల ప్రజల న్యాయమైన ఈ డిమాండును సిఎం కేసీఆర్‌ గౌరవిస్తారనే ఆశిస్తున్నాను. ఒకవేళ సిఎం కేసీఆర్‌ దీనిపై స్పందించకపోతే నేను ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి కూడా సిద్దమే. అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభిస్తాము,” అని హెచ్చరించారు.