సీఏఏ ఆందోళనలతో దేశం పరువు తీస్తున్నారు: కిషన్‌రెడ్డి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా నేడు డిల్లీలో పలు కార్యక్రమాలలో పాల్గోనున్నారు. సరిగ్గా ఇదేసమయంలో సీఏఏను వ్యతిరేకిస్తూ డిల్లీలో ఆందోళనలు చేయడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఖండించారు. సోమవారం డిల్లీ ఈశాన్యంలో జాఫ్రాబాద్‌లో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మద్య జరిగిన ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. వారిలో ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. 

సోమవారం ఉదయం జాఫ్రాబాద్‌, చాంద్‌బాగ్, ఖురేజి ఖాస్, భజన్‌పుర ప్రాంతాలలో సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ర్యాలీగా బయలుదేరారు. సీఏఏ అనుకూలవర్గానికి చెందిన కొందరు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ మొదలై చివరికి పరస్పరం రాళ్ళతో దాడి చేసుకొన్నారు. పోలీసులు, పారా మిలటరీదళాలు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. అయినా పరిస్థితుళు అదుపులోకి రాకపోవడంతో ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణలో డిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలకు చెందినవారితో సహా సుమారు 50 మంది గాయపడ్డారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ డిల్లీలో పర్యటిస్తున్నప్పుడు ఇటువంటి ఆందోళనలు చేస్తూ భారత్‌ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన కుట్రగానే భావిస్తున్నాను. సీఏఏను వ్యతిరేకిస్తున్నవారు దానివలన ఏ ఒక్క భారతీయుడికైనా నష్టం జరుగుతుందని నిరూపించగలరా? భారత్‌ ప్రతిష్టకు భంగం కలిగించేవిధంగా జరుగుతున్న ఈ ఆందోళనలకు రాహుల్‌ గాంధీ బాధ్యతవహిస్తారా లేదా అసదుద్దీన్ ఓవైసీ వహిస్తారా? ఈ ఘటనపై సమగ్రవిచారణ జరపాలని డిల్లీ పోలీసులను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. పార్లమెంటు చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే వారిని ఉపేక్షించబోము. వారిపై కటినచర్యలు తీసుకొంటాము,” అని అన్నారు.