సిఎం కేసీఆర్‌కు డిల్లీ నుంచి ఆహ్వానం

నిధుల కేటాయింపుపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మద్య ఘర్షణవాతావరణం నెలకొన్న ఈ సమయంలో డిల్లీ నుంచి సిఎం కేసీఆర్‌ ఆహ్వానం వచ్చింది. ఈనెల 24,25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దంపతులు, వారి కుమార్తె, అల్లుడు భారత్‌ పర్యటనకు వస్తున్నారు. వారు భారత్‌ పర్యటన ముగించుకొని వెళ్ళిపోయేముందు వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 25వ తేదీ రాత్రి రాష్ట్రపతి భవన్‌లో విందు ఇవ్వనున్నారు. ఆ విందు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సిఎం కేసీఆర్‌తో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. కనుక సిఎం కేసీఆర్‌ కూడా ఆ విందు కార్యక్రమంలో పాల్గొనేందుకు డిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ సిఎం ప్రతినిధిగా వేరెవరినైనా పంపించేందుకు అనుమతిస్తే రాష్ట్ర ఐ‌టి,పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ను పంపించే అవకాశం ఉంది.