
తెలంగాణ రాష్ట్రంలో 747 ప్రాధమిక వ్యవసాయ సహకారసంఘాల ఎన్నికలకు శనివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి కౌంటింగ్ చేసి వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే 157 సహకారసంఘాల ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన సంఘాలలో 5,406 సభ్యుల ఎన్నిక పూర్తయింది కనుక నేడు మిగిలిన 747 సంఘాలలోని 6,248 సభ్యులను ఎన్నుకోనున్నారు. వీటికి 14,529 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.50 లక్షల మంది సహకార సంఘాల సభ్యులు (ఓటర్లు) ఉన్నారు. వారందరూ నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈరోజు సాయంత్రంలోగా ఫలితాలు వెలువడతాయి కనుక రేపే (ఆదివారం) సహకార సంఘాలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎన్నుకొంటారు.