
తెలంగాణ, ఆంధ్రాతో సహా ఇరుగుపొరుగు రాష్ట్రాలలోని ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తున్న సింగరేణి సంస్థ సొంతంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేసుకోవడం విశేషం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పెగడపల్లి వద్ద 10 మెగావాట్స్ సామర్ధ్యంతో నిర్మించిన సోలార్ విద్యుత్ ప్లాంటును సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి నుంచి సోలార్ పవర్ డీజీఎం మురళీధరన్, ఇన్-చార్జ్ జీఎం మదన్ మోహన్, సింగరేణి ట్రాన్స్‌కో ఎస్ఈ సుధీర్, ఎన్‌పిడిసిఎల్ చీఫ్ కొ-ఆర్డినేటర్ రమేష్ బాబు, ఈ సోలార్ ప్లాంటును నిర్మించిన బీహెచ్ఈఎల్ తరపున శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన ఈ సోలార్ పవర్ ప్లాంటు నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వారి సమక్షంలో గ్రిడ్‌తో అనుసంధానం చేశారు.
ఇదికాక ప్రస్తుతం మణుగూరు, ఇల్లందు, రామగుండం-3లో కూడా మొత్తం 220 మెగా వాట్స్ సామర్ధ్యం కలిగిన మూడు సోలార్ పవర్ ప్లాంట్లు నిర్మించబడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోగా వాటిని కూడా పూర్తిచేయాలనే లక్ష్యంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి.