
కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా సవతి తల్లిలా వ్యవహరిస్తోందని, కనీసం కేంద్రపన్నుల వాటాలో రాష్ట్రానికి న్యాయంగా ఈయవలసిన వాటాను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని సిఎం కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్ మంత్రులు, నేతలు తరచూ ఆరోపిస్తుంటారు.
కనుక గత ఆరేళ్ళలో తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు విడుదల చేసిందనే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నకు ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానం తెలియజేశారు.
గత ఆరేళ్ళలో పన్నులలో రాష్ట్ర వాటాగా మొత్తం రూ.85,013 కోట్లు చెల్లించామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం పధకాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దులో రూ. 51,298.84 కోట్లు, స్థానిక సంస్థలకు రూ.6,511 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.3,853 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.1,916 కోట్లు, మహిళా శిశుసంక్షేమం కోసం రూ.1,500.54 కోట్లు, విపత్తుల పద్దు కింద రూ.1289.04 కోట్లు కలిపి మొత్తం రూ.1,51,381.42 కోట్లు చెల్లించామని తెలిపారు. పన్నులలో రాష్ట్ర వాటాగా వచ్చిన రూ. 85,013 కోట్లు తీసేస్తే గత ఆరేళ్ళలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 66,368.42 కోట్లు ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. అంటే అన్నిటికీ కలిపి ఏడాదికి కేవలం రూ.5,530.70 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నమాట! అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ లిఖితపూర్వకంగా తెలియజేసిన ఈ గణాంకాలపై రాష్ట్ర బిజెపి నేతలు ఏమంటారో?