
మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి హైదరాబాద్ పాతబస్తీలోని కాళీమాత ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరడంపై ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటుగా స్పందించారు. “ఎప్పుడూ హిందువుల పట్ల విద్వేష ప్రసంగాలు చేసే అక్బరుద్దీన్ ఓవైసీకి హటాత్తుగా హిందూ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరిక పుట్టడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. సిఎం కేసీఆర్ సూచన మేరకే హిందూ వ్యతిరేకిననే మచ్చ తొలగించుకోవడానికి అక్బరుద్దీన్ ఓవైసీ ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చు. కేసీఆర్ వ్యూహంలో భాగంగానే ఆయన ప్రగతి భవన్కు వెళ్ళి వినతిపత్రం ఇచ్చారని భావిస్తున్నాను. అయితే కాళీమాత ఆలయాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు. ఈవిషయంలో అక్బరుద్దీన్ ఓవైసీ జోక్యం అనవసరం. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు ఎమ్మెల్యేలకు సిఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వరు కానీ ఓవైసీ సోదరులు ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తుంటారు. ఆయన మజ్లీస్ పార్టీకి కాక రాష్ట్రమంతటికీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే బాగుంటుంది,” అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.