మహంకాళీ ఆలయాన్ని అభివృద్ధి చేయండి: ఓవైసీ

మజ్లీస్ పార్టీ శాసనసభా పక్షనాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆదివారం ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలిసి ఓ వినతి పత్రం అందజేశారు. పాతబస్తీలోని లాల్‌దర్వాజలో సింహవాహిని మహంకాళి దేవాలయం అప్పట్లో కేవలం 100 గజాల స్థలంలో నిర్మించారని, ఇప్పుడు ఆలయానికి భక్తుల రద్దీ పెరిగినందున తగినంత స్థలంలేక ఇబ్బంది పడుతున్నారని కనుక ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా అక్బరుద్దీన్ ఓవైసీ వినతిపత్రంలో కోరారు. ఆలయం అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించాలని కోరారు. మహంకాళీ ఆలయన్ని ఆనుకొని ఉన్నవారికి ఫరీద్ మార్కెట్ ప్రాంతంలో 800 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. అప్పుడు ఆలయ విస్తరణకు ఇబ్బంది ఉండబోదని సూచించారు. అలాగే పాతబస్తీలోని అఫ్జల్‌గంజ్‌ మసీద్‌ మరమత్తులకు రూ.3 కోట్లు మంజూరు చేయవలసిందిగా అక్బరుద్దీన్ ఓవైసీ వినతిపత్రంలో సిఎం కేసీఆర్‌ను కోరారు. 

దీనిపై సానుకూలంగా స్పందించిన సిఎం కేసీఆర్‌ అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు.