
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుచేయాలని చాలా కాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ దీనినే అస్త్రంగా టిఆర్ఎస్ మీద ప్రయోగించి ఓడించారు. తాను గెలిస్తే నిజామాబాద్‌లో నెలరోజులలోగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి గెలిచారు. కానీ పసుపుబోర్డుకు బదులు ప్రాంతీయ స్పైసస్ బోర్డు (మసాల దినుసుల ప్రాంతీయబోర్డు)ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అది పసుపుతో సహా అన్ని రకాల మసాలా దినుసులకు సంబందించి ఉత్పత్తి, మార్కెటింగ్‌కు సహకరిస్తుందని తెలిపారు. అన్ని మసాలా దినుసుల ఉత్పతులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా ఈ ప్రాంతీయబోర్డు సహకరిస్తుందని పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ప్రాంతీయబోర్డు ఏర్పాటుతో నిజామాబాద్ పసుపు రైతులు కోరినదానికంటే ఎక్కువ ప్రయోజనాలే కల్పించామని అన్నారు.
అయితే నిజామాబాద్‌లో ఈ ప్రాంతీయబోర్డు ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారు...దాని విధివిధానాలు ఏవిధంగా ఉంటాయి? తెలియవలసి ఉంది. పసుపు రైతులకు ఈ బోర్డు నిజంగానే ఉపయోగపడుతుందా లేదో బోర్డు ఏర్పాటయితే కానీ తెలియదు.