మేడారం జాతరకు సర్వం సిద్దం

ప్రతీ రెండేళ్ళకోసారి ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ ఏడాది ఫిబ్రవరి 5నుంచి 8 వరకు జరుగబోతోంది. జాతరకు ఒక రోజు ముందుగా అంటే నేడు...జంపన్నను మేళతాళలతో ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెపై కూర్చోబెడతారు. 

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి పెనక వంశీయులు సమక్క భర్త పగిడిద్దరాజు స్వామివారి విగ్రహాన్ని తీసుకొని కాలినడకన 24 గంటలపాటు దట్టమైన అడవుల గుండా ప్రయాణిస్తూ మేడారంకు చేరుకొని బుదవారం గద్దెలపై ప్రతిష్టిస్తారు. 

మరోపక్క ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి నుంచి దబ్బగట్ల వంశీయుల అధ్వర్యంలో పోదెంబాబు సారలమ్మ భర్త గోవిందరాజు స్వామివారిని మేడారంకు తీసుకువచ్చి బుదవారం ఉదయం గద్దెలపై ప్రతిష్టిస్తారు. దీంతో మేడారం జాతర ఆరంభమవుతుంది.  

ఆ తరువాత ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కన్నెపల్లె నుంచి సారలమ్మవారిని, చిలుకల గుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి గురువారం మధ్యాహ్నం గద్దెలపై ప్రతిష్టిస్తారు. విశేషమేమిటంటే, సమక్కను గద్దెలపైకి తీసుకువస్తున్నప్పుడు పోలీసులు గౌరవసూచకంగా తుపాకులతో గాలిలో కాల్పులు జరిపి స్వాగతం పలుకుతారు. శుక్రవారం ఉదయం నుంచి నలుగురు వనదేవతలు భక్తులకు దర్శనమిస్తారు.

ఇప్పటి వరకు సుమారు 40-45 లక్షల మంది భక్తులు మేడారం తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. రేపటి నుంచి అసలైన జాతర మొదలవుతుంది కనుక భక్తుల రద్దీ గణనీయంగా పెరుగనుంది. ఈసారి కోటిమందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు.