
కేంద్ర బడ్జెట్‌పై టిఆర్ఎస్ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించింది. దేశంలోకెల్ల గొప్ప ప్రాజెక్టుగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు…జాతీయప్రాజెక్టు హోదా ఇవ్వలేదు. బడ్జెట్లో విభజన హామీల ప్రస్తావనే లేదు. రైతుబంధు పధకం వలన రాష్ట్రంలో రైతులకు చాలా మేలు కలుగుతోందని ఆర్ధికసర్వేలో పేర్కొన్నప్పటికీ దానికీ నిధులు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏ విజ్ఞప్తిని కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా అది అనుసరిస్తున్న లోపభూయిష్టమైన ఆర్ధిక విధానాల వలన రాష్ట్ర ఆదాయం, వృద్ధిరేటు కూడా పడిపోతోంది,” అని అన్నారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం మొదటి నుంచి సవతి తల్లి ప్రేమనే చూపిస్తోంది. ఇప్పుడూ అలాగే వ్యవహరించింది. రాష్ట్రంలో అమలవుతున్న ఏ ప్రాజెక్టులు, సంక్షేమ పధకాలకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పుకొన్న ఆర్ధికమంత్రి రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు పైసా విదిలించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలకె పేర్లుమార్చి సొంత పధకాలని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.