
హైదరాబాద్, మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేటి నుంచి ప్రారంభమైన క్రెడాయ్ క్రెడాయ్ ప్రాపర్టీషోకు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘టిఎస్ ఐపాస్’ విధానంతో రాష్ట్రంలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఆ ప్రయత్నం విజయవంతమైనందున ఇప్పుడు అదేవిధంగా రాష్ట్రంలో భవననిర్మాణాలకు వేగంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా అనుమతులు మంజూరు చేసేందుకు త్వరలోనే టిఎస్ బిపాస్ పాలసీని ప్రకటించబోతున్నాము. ఈవిధానం అమలులోకి వస్తే భవననిర్మాణాల అనుమతుల కోసం చాలా సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కనుక భవననిర్మాణాలకు ఎవరూ ఏ కార్యాలయాలు.. అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు. అయినా అన్ని అనుమతులు చాలా త్వరగా లభిస్తాయి. దీని ద్వారా అక్రమకట్టడాల నిర్మాణాలను గుర్తించి అడ్డుకోగలుగుతాము. ఇటువంటి సరళమైన, పారదర్శకమైన విధానాలను అమలుచేస్తున్నందునే దేశంలో ఇతర రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ రంగం ఏవిధంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిలకడగా అభివృద్ధి చెందుతోంది,” అని అన్నారు.