.jpg)
హైదరాబాద్ నగరంలో మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నేటి నుంచి క్రెడాయ్ క్రెడాయ్ ప్రాపర్టీషో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి కేటీఆర్ క్రెడాయ్ సభ్యులను, నిర్మాణ సంస్థల యజమానులను ఉద్దేశ్యించి చాలా స్పూర్తిదాయకంగా ప్రసంగించారు.
“ఇక నుంచి ప్రతీ 3 నెలలకు ఒకసారి సమావేశమయ్యి మీరు (నిర్మాణసంస్థలు)ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిద్దాము. అలాగే నగరాభివృద్ధికి మీరు ఇచ్చే సలహాలను, సూచనలను స్వీకరిస్తాము. హైదరాబాద్లో ముఖ్యంగా... నగరం పశ్చిమంవైపు చాలా జోరుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. కనుక ఆ పరిసర ప్రాంతాలలో దుమ్ముధూళీ కూడా చాలా ఎక్కువగానే ఉంటోంది. దాని వలన పరిసర ప్రాంతాలలో నివశిస్తున్న ప్రజలకు, ముఖ్యంగా స్కూలు పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది కనుక నిర్మాణసమయంలో దుమ్ముధూళీ గాలిలోకి వ్యాపించకుండా ఉండేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం దీనికోసం నిబందనలు రూపొందించి తనికీలు చేసి జరిమానాలు విధించడం కంటే మీరే దీనిని సామాజిక బాధ్యతగా భావించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇక నగరంలో పార్కింగ్ సమస్యల గురించి మీ అందరికీ తెలుసు. మీ అందరూ కూడా సహకరిస్తే ఈ సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు. నగరంలో అపార్టుమెంటులు నిర్మిస్తున్నప్పుడు వాటిలో ఒకటో రెండో అంతస్తులు మీరు పబ్లిక్ కార్ పార్కింగ్ కోసం కేటాయించడానికి అంగీకరిస్తే, డానికి బదులుగా అదనంగా ఒకటో రెండో అంతస్తులు నిర్మించుకొనేందుకు అనుమతి మంజూరు చేయాలని అనుకొంటున్నాము. దీనికోసం త్వరలోనే ప్రభుత్వం ఒక నూతన పాలసీని ప్రకటించబోతోంది. ఈ ప్రతిపాదనపై కూడా మీ అందరూ లోతుగా ఆలోచించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నాను.
అలాగే దేశంలో మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిలో 41 శాతం శుద్దిచేసి మళ్ళీ వినియోగించుకొంటున్నాము. ఈవిధంగా శుద్ధిచేసిన నీటిని మొక్కలు పెంపకానికి, పరిశ్రమలకు వినియోగించుకొంటున్నాము. కనుక హైదరాబాద్ నగరంలోని నిర్మాణ సంస్థలు కూడా ఈ శుద్ధి చేసిన నీటిని భవనాల నిర్మాణంలో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో మీరు ముందుకు వస్తే ప్రభుత్వం నగరం చుట్టూ 200-300 మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉంది. శుద్ధి చేసిన మురుగునీటిని నిర్మాణరంగంలో కూడా వినియోగించుకోగలిగితే మూసీనది కూడా శుభ్రపడుతుంది,” అని అన్నారు.