దర్శకుడికి భూకేటాయింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎన్‌.శంకర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నామమాత్రపు ధరకు 5 ఎకరాల భూమిని కట్టబెట్టడంపై హైకోర్టు ఓ ప్రజాహిత పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు దాఖలు చేసిన ఆ పిటిషన్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని వారు సవాలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి, సంబందిత రెవెన్యూ అధికారులకు కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. 

తెలంగాణ ఉద్యమ సమయంలో దర్శకుడు శంకర్‌ ‘జై బోలో తెలంగాణ’ సినిమాను నిర్మించి ప్రజలలో ఉద్యమకాంక్షను రగిలించారు..కెసిఆర్ నాయకత్వంలో సాగుతున్న ఉద్యమాలలో ఆయన కూడా చురుకుగా పాల్గొన్నారు. దాంతో టిఆర్ఎస్‌ అధిష్టానంతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. 

గత ఏడాది ఆయన హైదరాబాద్‌లో సినిమా స్టూడియో నిర్మాణానికి భూమి ఇప్పించవలసిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ఎకరం రూ.5 లక్షలు చొప్పున 5 ఎకరాలు కేటాయించింది. కోట్లు విలువచేసే భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.25 లక్షలకు శంకర్‌కు కట్టబెట్టడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్‌ దాఖలైంది.