నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో సమావేశాలు మొదలవుతాయి. నేటి నుంచి ఫిబ్రవరి 11వరకు తొలి దశ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. 

ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్ధికసర్వేను పార్లమెంటుకు సమర్పిస్తారు. పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరిన ఆదాయంలో రాష్ట్రాలకు ఈయవలసిన 42శాతం వాటాలో కేంద్రం ఈసారి కొంచెం కోత విధించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఆ ఊహాగానాలు నిజమా కాదాఅనే సంగతి ఆర్ధికసర్వేను పార్లమెంటులో ప్రవేశపెడితే తెలుస్తుంది. రేపు అంటే..శనివారం ఉదయం 11 గంటలకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2020-2021 ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 

దేశంలో ఆర్ధికమాంద్యం నెలకొన్న దృష్ట్యా ఈసారి బడ్జెట్‌లో కోతలు, పన్నుల పెంపులే తప్ప ప్రజలకు పెద్దగా వరాలు ఉండకపోవచ్చు. రెండవ దశ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మళ్ళీ మార్చి 2 నుంచి మొదలయ్యి ఏప్రిల్ 3వరకు కొనసాగుతాయి. అప్పుడు బడ్జెట్‌ కేటాయింపులపై పార్లమెంటులో లోతుగా చర్చించి ఆమోదముద్ర వేస్తారు. ఈసారి బడ్జెట్‌ సమావేశాలలో కేంద్రప్రభుత్వం మొత్తం 45 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం.