
మునిసిపల్ ఎన్నికలలో కొన్ని చోట్ల కాంగ్రెస్, బిజెపిలు సహకరించుకొన్నాయి. ఆ స్థాయిలో ఇది సహజమే కానీ అది విమర్శలకు అవకాశం కల్పించింది. రాజకీయంగా బద్ధ శత్రువులైన కాంగ్రెస్, బిజెపిలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లపై పరస్పరం యుద్ధం చేస్తున్నాయి. కానీ రెండు పార్టీలు కూడా ఆరోపణలు చేస్తుండటంతో టిఆర్ఎస్ వాటికి జవాబు ఇవ్వక తప్పలేదు.
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సీఏఏపై కొట్లాడుకొంటున్న కాంగ్రెస్, బిజెపిలు మునిసిపల్ ఎన్నికలలో సహకరించుకోవడం చూసి ప్రజలే ఆశ్చర్యపోయారు. సీఏఏ వాటి స్నేహానికి అవరోధం కాలేదు. సీఏఏను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి బిజెపి, సీఏఏను వ్యతిరేకిస్తూ దానిని తెచ్చిన బిజెపితోనే చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నాయి. దీంతో వాటివి ఉత్తుత్తి పోరాటలని అర్ధమైంది. బిజెపి మతాన్ని నమ్ముకొంటే, కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులను నమ్ముకొని రాజకీయాలు చేస్తుంటుంది. కానీ టిఆర్ఎస్ మాత్రం ప్రజలనే నమ్ముకొని పనిచేస్తుంటుంది. అందుకే మునిసిపల్ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్‌ను గెలిపించి ఆశీర్వదించారు. కనుక ఇకనైనా కాంగ్రెస్, బిజెపిలు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షాలుగా వ్యవహరిస్తే మంచిది. కాదని సిఎం కేసీఆర్, కేటీఆర్‌లపై అసత్యఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోము,” అని కర్నె ప్రభాకర్ కాంగ్రెస్, బిజెపిలను హెచ్చరించారు.