మునిసిపల్ ఎన్నికలతో టిఆర్ఎస్‌ కొత్త చరిత్ర: తలసాని

మునిసిపల్ ఎన్నికలు, తదనంతర పరిణామాలపై అధికార ప్రతిపక్షపార్టీల నేతల మద్య ప్రస్తుతం మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. టిఆర్ఎస్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. 

మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ మునిసిపల్ ఎన్నికలలో అన్ని వర్గాలవారికి రాజకీయంగా ఎదిగేందుకు చక్కటి అవకాశం కల్పించారు. వారిరువురూ టిఆర్ఎస్‌కు, ప్రభుత్వానికి, రాష్ట్రానికి రెండు కళ్ళవంటివారు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలుపు ఒక చరిత్ర అయితే... అన్ని వర్గాలవారికి ప్రాధాన్యత కల్పించడం మరో చరిత్రగా నిలిచిపోతుంది. అందుకే రాష్ట్ర ప్రజలు మా పార్టీని అఖండమెజార్టీతో గెలిపించి దీవించారు. మా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు కూడా మా గెలుపుకు ఎంతో దోహదపడ్డాయని భావిస్తున్నాను. కాంగ్రెస్‌, బిజెపిలు అనైతిక పొత్తులు పెట్టుకొని ఈ ఎన్నికలలో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి కానీ ప్రజలు కాల్చి వాతలు పెట్టారు. అయినా వారికి ఇంకా బుద్దిరాలేదు. మా పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్స్‌అఫీషియో విధానాన్ని మొదట కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిన సంగతి మరిచిపోయి, ఒకపక్క దానిని వినియోగించుకోంటూనే మళ్ళీ మా పార్టీని నిందిస్తోంది. నేరేడుచర్లలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆడిన డ్రామాలను చూసి ప్రజలు అసహ్యించుకొంటున్నారు. కనుక ఇకనైనా కాంగ్రెస్‌, బిజెపిలు మాపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి,” అని అన్నారు.