జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 11వరకు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2020-2021 ఆర్ధిక సంవత్సరాలకు బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. దానిపై ఉభయసభలలో చర్చలు జరిపిన తరువాత ఫిబ్రవరి 11న సమావేశాలు వాయిదా పడతాయి. మళ్ళీ మార్చి 2 నుంచి ఏప్రిల్ 3వరకు మరోసారి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తారు. ఆలోగా బడ్జెట్‌ కేటాయింపులపై పార్లమెంటరీ కమిటీలు సమీక్షించి, పార్లమెంటు సమావేశాలలో మరింత లోతుగా చర్చిస్తారు. బడ్జెట్‌ ఆమోదించిన తరువాత పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి.

ఇవి బడ్జెట్‌ సమావేశాలే అయినప్పటికీ, కేంద్రప్రభుత్వం వివిద బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. అలాగే వివిద అంశాలు, సమస్యలపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకొంటున్నాయి. ఈసారి సమావేశాలలో ప్రధానంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ల అమలుపై అధికార ప్రతిపక్షాల మద్య వాడివేడిగా చర్చలు జరుగవచ్చు. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని జగన్ ప్రభుత్వం కేంద్రం ఆమోదం కోసం పంపింది కనుక ఈ బడ్జెట్‌ సమావేశాలలో దానిని పార్లమెంటులో ప్రవేశపెడుతుందో లేదో చూడాలి. సీఏఏపై కేంద్రప్రభుత్వంతో పోరాడేందుకు సిఎం కేసీఆర్‌ సిద్దపడుతున్నందున ఈసారి టిఆర్ఎస్‌ ఎంపీలు వివిద అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీసే అవకాశం ఉంది.