నేరేడుచర్ల ఛైర్మన్ ఎన్నిక వివాదం..కలక్టర్‌, కమీషనర్ మెడకు?

నేరేడుచర్ల ఛైర్మన్ ఎన్నికలో తలెత్తిన వివాదం సూర్యాపేట జిల్లా కలక్టర్ డి.ఆమోయ్ కుమార్, నేరేడుచర్ల మునిసిపల్ కమీషనర్ మహేందర్ రెడ్డి మెడలకు చుట్టుకొంది. నేరేడుచర్లలో ఎక్స్‌అఫీషియోగా పేరు నమోదు చేయించుకొన్న కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేరును మొదట జాబితాలో నుంచి తొలగించినందుకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన కలుగజేసుకొని కేవీపీ రామచంద్రరావు పేరును జాబితాలో చేర్చవలసిందిగా ఆదేశించారు. అంతేకాదు..ఆమోయ్ కుమార్‌ను బదిలీ చేయవలసిందిగా ఆదేశించడంతో ప్రభుత్వం ఆయనను రంగారెడ్డి జిల్లా కలక్టరుగా బదిలీ చేసింది. యాదాద్రి-భువనగిరి జిల్లా కలక్టర్ అనితా రామచంద్రన్‌కు సూర్యాపేట జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారంలో నేరేడుచర్ల మునిసిపల్ కమీషనర్ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు, పోలీసులు రాజకీయాలకు అతీతంగా పనిచేయవలసి ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలో వారిపై తీవ్రఒత్తిళ్ళు ఉంటాయి. కనుక ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. కానీ కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం...అన్నట్లు వారు అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ అధికార పార్టీని కాదని నిర్ణయాలు తీసుకొంటే మంత్రుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. కనుక ఎన్నికల విధులు నిర్వహించడం ప్రభుత్వోద్యోగులకు కత్తి మీద సామువంటిదేనని చెప్పవచ్చు.