
అక్రమాస్తుల కేసులలో సిబిఐ కోర్టు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రిగా ఉన్న తాను ప్రతీ శుక్రవారం హైదరాబాద్ వచ్చి, నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణకు హాజరవడం చాలా కష్టమని కనుక తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాల్సిందిగా సిబిఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాల్సిందిగా సిబిఐ న్యాయవాది అభ్యర్ధించడంతో ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. అప్పటిలోగా పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నట్లు సిబిఐ కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. ఆయన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది తప్ప వ్యక్తిగతహాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మద్యంతర ఉత్తర్వులు ఏవీ జారీ చేయలేదు. కనుక ఈ శుక్రవారం జగన్ సిబిఐ కోర్టుకు హాజరవుతారో లేదో?