
చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొంది. 20 వార్డులున్న చౌటుప్పల్ మునిసిపాలిటీలో టిఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బిజెపి 3, సిపిఎం 3 వార్డులు గెలుచుకొన్నాయి. దాంతో మునిసిపల్ ఛైర్మన్ పదవి కోసం టిఆర్ఎస్, కాంగ్రెస్‌లు పోటీ పడుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఎక్స్‌అఫీషియో), సిపిఎంకు చెందిన ముగ్గురు సభ్యులతో కలిపి కాంగ్రెస్ పార్టీ బలం 9కు చేరుతుందనుకొంటే, చివరి నిమిషంలో సిపిఎం సభ్యులు టిఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్దపడటంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో వారిని కార్యాలయం లోపలకు వెళ్లకుండా అడ్డుకొని వారి ప్రమాణపత్రాలను చించివేశారు. టిఆర్ఎస్ సభ్యులు వారికి అండగా రావడంతో కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఎం సభ్యులు ఒకరినొకరు కాలర్లు పట్టుకొని కొట్టుకొన్నారు. దాంతో పోలీసులు అందరినీ చెదరగొట్టి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గొడవ కారణంగా సభ్యుల ప్రమాణస్వీకారం ఆలస్యమవుతోంది.