
తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచిపెట్టి అధికారదుర్వినియోగానికి పాల్పడి ఎన్నికలలో గెలిచిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, బిజెపిలు తమకు మెజార్టీవచ్చిన మునిసిపాలిటీలను సైతం దక్కించుకోవడానికి టిఆర్ఎస్ పావులు కదుపుతుండటంతో తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
భైంసా, జల్పల్లిమునిసిపాలిటీలలో టిఆర్ఎస్ మిత్రపక్షం మజ్లీస్ గెలుచుకోగా, ఆమన్గల్, తుక్కుగూడ మున్సిపాలిటీలలో బిజెపి, చండూరు వడ్డేపల్లిలో కాంగ్రెస్ మెజార్టీ సాధించాయి.
మక్తల్ మునిసిపాలిటీలో 16వార్డులు ఉండగా వాటిలో బిజెపి 8 గెలుచుకొంది. బిజెపి ఎమ్మెల్సీ రామచందర్ రావు (ఎక్స్అఫిషియో), ఒక స్వతంత్ర అభ్యర్ధితో కలిపి బిజెపి బలం 10కి చేరింది. కానీ అక్కడా టిఆర్ఎస్ ఎక్స్అఫిషియో, స్వతంత్రుల మద్దతుతో ఛైర్మన్ పదవిని కైవసం చేసుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తుండటంతో బిజెపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇక నారాయణ్ ఖేడ్, తుర్కయాంజల్, ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట, హాలియా మునిసిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. కానీ టిఆర్ఎస్ స్వతంత్రులు, ఎక్స్అఫిషియో సభ్యుల మద్దతుతో వాటిని కూడా కైవసం చేసుకొనేందుకు సిద్దం అవుతోంది.
ఇక నేరేడుచెర్ల మునిసిపాలిటీలోగల 15 వార్డులలో కాంగ్రెస్, టిఆర్ఎస్లకు చెరో ఏడు వార్డులు గెలుచుకోవడంతో ఛైర్మన్ పదవి కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సిపిఎం మద్దతు ఇస్తున్నప్పటికీ, టిఆర్ఎస్ ముగ్గురు ఎక్స్అఫిషియో సభ్యుల మద్దతుతో ఛైర్మన్ పదవి దక్కించుకోవడానికి పావులు కడుపుతుండటంతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిఎం కేసీఆర్ రాష్ట్రంలో రాజకీయవ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని, మునిసిపల్ ఎన్నికలలో..ఇప్పుడు ఛైర్మన్ పదవుల కోసం టిఆర్ఎస్ చాలా నీచానికి దిగజారిపోయిందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. మునిసిపల్ ఎన్నికలకు ముందు తిరుగుబాటు అభ్యర్ధులను తిరిగి పార్టీలో చేర్చుకోమని చెప్పిన కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు వారితోపాటు ఇతరపార్టీల కౌన్సిలర్లను కూడా నయన్నో, భయాన్నో లొంగదీసుకొని మునిసిపల్ ఛైర్మన్ పదవులు కైవసం చేసుకోవాలని కుటిలప్రయత్నాలు చేస్తోందని వారు ఆరోపించారు.