నేడు మేయర్, ఛైర్మన్‌ల ఎన్నిక

రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్‌ ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధులు వారివారి మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ కార్యాలయాలలో సోమవారం ఉదయం 10.30 గంటలకు పాలకమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, ఛైర్మన్‌ల ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. ఆ తరువాత వారు డెప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్లను ఎన్నుకొంటారు.

రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలలో టిఆర్ఎస్‌ 113, మజ్లీస్-2 గెలుచుకోగా, కాంగ్రెస్‌-2, బిజెపి-3లను నిలబెట్టుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వాటిని కూడా ఎక్స్‌ప్రెస్‌లో అఫిషియో ఓట్లు, ఎన్నికలలో గెలిచిన స్వతంత్ర, తిరుగుబాటు అభ్యర్ధులు, ఇంకా అవసరమైతే కాంగ్రెస్‌, బిజెపి కౌన్సిలర్ల సాయంతో దక్కించుకొనేందుకు టిఆర్ఎస్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ టిఆర్ఎస్‌ ప్రయత్నాలు ఫలిస్తే టిఆర్ఎస్‌ దాని మిత్రపక్షం మజ్లీస్ పార్టీలే రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలను దక్కించుకొంటాయి. కాంగ్రెస్‌, బిజెపిలు మళ్ళీ ప్రతిపక్ష బెంచీలకే పరిమితం కావలసి ఉంటుంది. 

ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. జిల్లాకలెక్టర్లు అధ్వర్యంలో మేయర్, ఛైర్మన్ ఎన్నికలు జరుగుతాయి. ఆ తరువాత గెలిచిన అభ్యర్ధులకు దృవీకరణపత్రాలు అందజేయడంతో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పూర్తిస్థాయి పాలకమండళ్ళ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది.