
71వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికార, ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సిఎం కేసీఆర్ అనేక సమస్యలను ఎదుర్కొని అధిగమిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపధంలో ముందుకు నడిపిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిపారు. ప్రజల అవసరాలను, వారి సమస్యలను గుర్తించి తదనుగుణంగా పధకాలను, విధానాలను రూపొందిస్తూ పారదర్శకమైన పాలన అందిస్తున్నారు. అలాగే వివిద వ్యవస్థలలో లోపాలను సవరిస్తూ అవినీతిరహితంగా తీర్చిదిద్దుతున్నారు. సిఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని కోరుకొంటున్నాను. జై హింద్.. జై తెలంగాణ!”, అంటూ ప్రసంగం ముగించారు.