
నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిల్లీలో రాజ్‌పథ్ వద్ద జాతీయజెండాను ఆవిష్కరించి త్రివిధదళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సోనారో ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాజ్‌పథ్ లో వివిద రాష్ట్రాల సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలు, త్రివిధ దళాల కవాతు, వాటి యుద్ధవిమానాలు, ట్యాంకులు తదితర ఆయుధ ప్రదర్శన అందరినీ ఆకట్టుకొంది. అనంతరం వివిద ప్రభుత్వశాఖల శకటాలు, డిల్లీ స్కూలు విద్యార్ధుల సాంస్కృతిక ప్రదర్శనలు కళ్ళకు ఇంపుగా కొనసాగాయి.
ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ శకటం కూడా పాల్గొంది. తెలంగాణ సంస్కృతీ, చారిత్రిక ప్రాశస్త్యాన్ని, తెలంగాణ పండుగలను ప్రతిబింబించేవిధంగా దానిని సుందరంగా తీర్చిదిద్దారు. గిరిజన కళాకారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకొన్నాయి. చివరిగా భారత వాయుసేనకు చెందిన హెలికాఫ్టర్లు, యుద్ధవిమానాల గగన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకలకు ప్రధాని నరేంద్రమోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు కేంద్రమంత్రులు, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ తదితర పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.