రేపు దావోస్ వెళ్ళనున్న మంత్రి కేటీఆర్‌

ఈనెల 20 నుంచి 24వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగబోయే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సమావేశాలలో పాల్గొనాలని కోరుతూ రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క మునిసిపల్ ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉన్నందున ఆ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్‌ ఆదివారం రాత్రి దావోస్ బయలుదేరుతున్నారు. ఇదివరకు అంటే...2018లో జరిగిన సమావేశాలకు మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహాకాల గురించి...దాంతో రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి గురించి ఆ సదస్సులో చక్కగా వివరించి దానిలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలను, వివిద సంస్థల సీఈఓలను ఆకట్టుకొన్నారు. అప్పటి నుంచే విదేశీ సంస్థలు తెలంగాణ రాష్ట్రంపై ఆసక్తి చూపుతూ పెట్టుబడులు పెడుతున్నాయి.

గత ఏడాది జరిగిన డబ్ల్యూఈఎఫ్‌ సదస్సుకు కూడా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందినప్పటికీ పని ఒత్తిడి వలన హాజరుకాలేకపోయారు. కానీ ఈసారి ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేడు దావోస్ బయలుదేరుతున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ కూడా దావోస్ బయలుదేరుతున్నారు.