
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెరాస కార్యదర్శి దర్గా దయాకర్ రెడ్డి శుక్రవారం పార్టీకి రాజీనామా చేసి ఎంపీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అనుచరుడైన ఆయన ఫీర్జాదీగూడా మేయర్ పదవిని ఆశిస్తున్నారు. కానీ మంత్రి మల్లారెడ్డి తన అనుచరుడైన జక్క వెంకట్రెడ్డికి ఆ టికెట్ ఇప్పించుకోవాలని నిర్ణయించడంతో సుధీర్ రెడ్డి, దయాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వారిరువురినీ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించడంతో దయాకర్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మంత్రి మల్లారెడ్డితో పార్టీలో సమస్యలు ఎదుర్కొంటున్న సుధీర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు రేవంత్ రెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు.
సుధీర్ రెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికలలో మేడ్చల్ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ డిసెంబర్ 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో సిఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందికి టికెట్లు కేటాయించినప్పటికీ, సుధీర్ రెడ్డిని పక్కన పెట్టి మల్లారెడ్డికి టికెట్ కేటాయించడం, ఆయన గెలిచి మంత్రి పదవి దక్కించుకొన్నప్పటి నుంచి వారివురి మద్య ఆధిపత్యపోరు మొదలైనట్లు తెలుస్తోంది.
ఆ కారణంగానే మున్సిపల్ ఎన్నికలలో తనకు మేయర్ పదవి దక్కకుండా మల్లారెడ్డి అడ్డుపడుతున్నారనే ఆగ్రహంతో దయాకర్ రెడ్డి తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరి సుధీర్ రెడ్డి తెరాసలోనే కొనసాగుతారా లేదా అయనా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారా? త్వరలో తెలుస్తుంది.