గ్రౌండ్ ఖాళీ...కానీ జాగ్రత్తగా ఆడండి!

తెలంగాణ భవన్‌లో నిన్న జరిగిన తెరాస ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్-ఛార్జ్ లతో సమావేశమైన సిఎం కేసీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మున్సిపల్ ఎన్నికల గ్రౌండ్ ఖాళీగా ఉంది. మనమే గెలుస్తామని సర్వేలలో తేలింది. అయినప్పటికీ అతివిశ్వాసంతో వ్యవహరిస్తే నష్టపోతాము. కనుక అందరూ చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. ఈ ఎన్నికలలో మంత్రులెవరూ కలుగజేసుకోరు. ఎమ్మెల్యేలదే పూర్తి బాధ్యత. అసెంబ్లీ ఎన్నికలలో నేను మీ అందరినీ గెలిపించుకోవడానికి ఏవిధంగా కష్టపడ్డానో..అదేవిధంగా ఇపుడు మీరు కూడా మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్ధులను గెలిపించుకోవడానికి గట్టిగా కృషి చేయాలి. ప్రభుత్వ పధకాలతో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. కానీ అంతమాత్రన్న ప్రజలు మనకే ఓట్లు వేస్తారనుకోకుండా అభ్యర్ధులు ఇంటింటికీ వెళ్ళి ప్రతీ ఓటరును, లబ్దిదారుని కలిసి తమను గెలిపిస్తే మరిన్ని మంచి పధకాలు ప్రవేశపెడతామని, గ్రామాలను, పట్టణాలను మరింతగా అభివృద్ధి చేస్తామని నచ్చజెప్పి మనకే ఓటు పడేలా చూసుకోవాలి. 

మున్సిపల్ ఎన్నికలలో మన అభ్యర్ధులు గెలిస్తేనే ఎమ్మెల్యేలు బలపడతారనే సంగతి ఎవరూ మరిచిపోవద్దు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలాగా ఈ ఎన్నికలలో పార్టీల ప్రభావం కంటే స్థానిక సమస్యలు, అభ్యర్ధుల బలాబలాలు, గుణగణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కనుక అందుకు తగ్గట్లుగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలి.

అలాగే టికెట్ ఆశించి భంగపడినవారికి పరిస్థితి అర్ధమయ్యేలా నచ్చజెప్పడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు పార్టీ ఎంపిక చేసిన అభ్యర్ధుల గెలుపుకు కష్టపడి పనిచేస్తే మున్ముందు నామినేటడ్ పదవులు లభిస్తాయని నచ్చజెప్పాలి. అయినప్పటికీ వినకుండా పార్టీ అభ్యర్ధులపై పోటీకి దిగితే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను. ఇదే విషయం వారికి చెప్పి నచ్చజెప్పి వీలైనంత వరకు అందరినీ కలుపుకుపోయేందుకు గట్టిగా ప్రయత్నించండి,” అని సిఎం కేసీఆర్‌ మార్గదర్శనం చేశారు.