
మున్సిపల్ ఎన్నికలలో పోటీకి ఎంపికైన తెరాస అభ్యర్ధుల చేతికి నేడు బీ-ఫారంలు అందనున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు సిఎం కేసీఆర్ తెరాస ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. ఈసారి అభ్యర్ధుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకే అప్పగించినందున సిఎం కేసీఆర్ వారికి బీ-ఫారంలు అందజేయనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల పార్టీ ఇన్-ఛార్జ్ లు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వారికి సిఎం కేసీఆర్ ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన తరువాత బీ-ఫారంలు అందజేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం తెరాస అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ బుదవారం రాత్రికి పూర్తయింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది కనుక బీ-ఫారంలు అందగానే తెరాస అభ్యర్ధులు వెంటనే నామినేషన్లు వేయడం ప్రారంభించవచ్చు.
రిజర్వేషన్లు-నామినేషన్లకు మద్యన ఎక్కువ వ్యవధి ఇవ్వకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం తెరాసకు కలిసివస్తుందని భావించవచ్చు. నామినేషన్లు వేసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున రిజర్వేషన్ల ప్రకారం ఆశావాహులలో సరైన అభ్యర్ధులను ఎంపిక చేయడం, వారు నామినేషన్లు వేయడానికి అవసరమైన పత్రాలను సిద్దం చేసుకోవడం చాలా కష్టమే. పైగా టికెట్ లభించనివారు రెబెల్ అభ్యర్ధులుగా పోటీ చేసే ప్రమాదం ఉందనే ఉంటుంది. దీంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేయడంలో చాలా బిజీగా ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది:
నోటిఫికేషన్: జనవరి 7
నామినేషన్ల స్వీకరణ: జనవరి 8 నుంచి 11 వరకు
నామినేషన్ల పరిశీలన: జనవరి 12
నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీలు: జనవరి 12,13
నామినేషన్ల ఉపసంహరణ: జనవరి 14వరకు
పోలింగ్: జనవరి 22
అవసరమైతే రీపోలింగ్: జనవరి 24
కౌంటింగ్, ఫలితాలు ప్రకటన: జనవరి 25.