మోడీ, అమిత్ షాలు మాట్లాడరేమి? అసదుద్దీన్ ప్రశ్న

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్)లను వ్యతిరేకిస్తూ ఈనెల 10న మజ్లీస్ అధ్యర్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని దారుస్‌ సలాం వద్ద జరిగిన బహిరంగసభలో ముస్లిం ప్రజలను ఉద్దేశ్యించి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, “డిల్లీ జెఎన్‌ యూనివర్సిటీ విద్యార్దులు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసినందుకే వారిపై దాడులు జరిగాయి. ఆ ఆందోళనలలో పాల్గొన్న విద్యార్ది సంఘం నేతలనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని అర్ధమవుతూనే ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్న వారిని భౌతికదాడులతో అణచివేయాలనుకోవడం సరికాదు. తద్వారా దేశప్రజలకు బిజెపి ఎటువంటి సంకేతాలు ఇస్తోంది? జరిగిన ఈ ఘటనలపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు ఎందుకు స్పందించలేదు? దేశరాజధాని డిల్లీలో రౌడీమూకలు యూనివర్సిటీలో జొరబడి విద్యార్దులపై దాడులు చేస్తుంటే ఆ విషయం పోలీసులకు తెలియదంటే నమ్మశక్యంగా లేదు. కొద్దిమంది రౌడీలనే అడ్డుకోలేనప్పుడు దేశానికి హాని తలపెట్టేవారిని ఏవిధంగా అడ్డుకోగలరు? డిల్లీ యూనివర్సిటీ విద్యార్దులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పిఆర్‌లతో దేశాన్ని విచ్చినం చేసేందుకు కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవలసిన అవసరం ఉంది. వాటికి వ్యతిరేకంగా ఈనెల 10న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తాము. దానిలో ముస్లింలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.