
డిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా సోమవారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. నేటి నుంచి డిల్లీ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని తెలిపారు.
డిల్లీ ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది:
జనవరి 14: నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ
జనవరి 21: నామినేషన్లు దాఖలు చివరి రోజు
జనవరి 23: నామినేషన్ల పరిశీలన
జనవరి 24: నామినేషన్ల ఉపసంహరణకు గడువు
ఫిబ్రవరి 8: పోలింగ్
ఫిబ్రవరి 11ఎల్ ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి.
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు చాలా విభిన్నమైనవని చెప్పవచ్చు. ఎందుకంటే డిల్లీ రాష్ట్రం కాదు అలాగని కేంద్రపాలిత ప్రాంతం కాదు. డిల్లీలో కేంద్రప్రభుత్వం కొలువైయుంటుంది. అక్కడే డిల్లీ అసెంబ్లీ కూడా ఉంటుంది. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమాద్మీ ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు కాంగ్రెస్ పార్టీ ఏకధాటిగా 15 ఏళ్ళపాటు డిల్లీని పాలించింది. ఓ ప్రభంజనంలా రాజకీయాలలోకి ప్రవేశించిన ఆమాద్మీపార్టీ తొలి ప్రయత్నంలోనే భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంది. ఆమాద్మీని ఓడించాలని కాంగ్రెస్, బిజెపిలు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
పంటి కింద రాయిలా మారిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఏదోవిధంగా గద్దె దించాలని కేంద్రప్రభుత్వం విఫలయత్నాలు చేసింది కానీ ఫలించలేదు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యంత ప్రజాకర్షక పధకాలు ప్రవేశపెడుతూ, ప్రజలకు అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తూ ప్రజాధారణ సొంతం చేసుకొన్నారు. కనుక ఈసారి కూడా ఆ ప్రజాభిమానంతోనే ఘనవిజయం సాధించగలమని అరవింద్ కేజ్రీవాల్ నమ్మకంగా ఉన్నారు. కానీ ఈసారి ఎలాగైనా ఆమాద్మీని ఓడించి డిల్లీ ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, బిజెపిలు పట్టుదలగా ఉన్నాయి. మరి ఈసారి ఎన్నికలలో ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.