
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే తమ ప్రత్యర్ధిగా భావిస్తున్నామంటూ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మాటలపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. “కేటీఆర్‌కు ఇంకా రాజకీయాలు పూర్తిగా అబ్బినట్లు లేదు. అందుకే యావత్ దేశంలో...తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్న బిజెపిని కాక కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయమని చెపుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో నాలుగు స్థానాలు గెలుచుకోవడంతో మా పార్టీ బలం ఏమిటో కేసీఆర్, కేటీఆర్‌లకు తెలిసివచ్చింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ సరిగ్గా నిద్రపట్టడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కనుమరుగైంది. తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఘన విజయం సాధించి అది మరోసారి రుజువు చేసుకొంటాము.
దేశంలో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ సీఏఏ పేరుతో ప్రజల మద్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తోంది. దానికి తెరాస, మజ్లీస్ పార్టీలు వంతపాడుతున్నాయి. దీనిని బట్టి కాంగ్రెస్, తెరాస, మజ్లీస్ పార్టీలు మూడు ఒక్కటేనని అర్ధమవుతోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేయించినప్పుడు తప్పుకానప్పుడు కేంద్రప్రభుత్వం చేస్తే తప్పు ఎలా అవుతుంది?
2020 సం.ని తెలంగాణ బిజెపి పోరాటాల సంవత్సరంగా పరిగణించి ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో అలుపెరుగని పోరాటాలు చేస్తాము. రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తాము. వాటిలో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకొంటాము. ఈ నెల 7వ తేదీన మోత్కుపల్లి నర్సింహులు, కొందరు తెరాస ముఖ్యనేతలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో డిల్లీలో మాపార్టీలో చేరానున్నారు,” అని అన్నారు.