
నేడు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ముగ్గురూ మేడారంలో పర్యటించనునారు. వారు ముగ్గురూ హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి మేడారం చేరుకొంటారు. అక్కడ సమ్మక్క సారలమ్మవార్లకు పూజలు చేసిన తరువాత మేడారం జాతరకు చేస్తున్న ఏర్పాట్ల గురించి ములుగు జిల్లా అధికారులతో చర్చిస్తారు. అనంతరం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ తిరిగి చేరుకొని సిఎం కేసీఆర్‌ను కలిసి ఏర్పాట్ల గురించి ఆయనకు వివరిస్తారు.
మేడారం జాతర ఫిబ్రవరి 5నుంచి మొదలవుతుంది. ఆరోజున కన్నేపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి గోవిందరాజులను, మరుసటి రోజున చిలకలగుట్ట నుంచి సమ్మక్కలను మేడారంలోని గద్దెలవద్దకు తీసుకురావడంతో అసలైన జాతర మొదలవుతుంది. మళ్ళీ ఫిబ్రవరి 8న ముగ్గురు వనదేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అయితే జాతరకు నెలరోజులు ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు మేడారం తరలివెళుతూ అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటుంటారు. కనుక జనవరి 1 నుంచే హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి మేడారంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించడం ప్రారంభించింది.