బిజెపి కాదు... కాంగ్రెస్‌ మా ప్రత్యర్ది: కేటీఆర్‌

నూతన సంవత్సరం సందర్భంగా తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “2019 సం. తెరాసకు ఎంతో అద్భుతంగా సాగింది. మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా 2020ను కూడా గొప్పగా మలుచుకోబోతున్నాము. సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్బుతమైన ప్రగతి సాధిస్తోంది.    కనుక మరో దశాబ్ధకాలంపాటు తెలంగాణలో తెరాసకు తిరుగు ఉండబోదు. బిజెపిని నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అది నేటికీ అలాగే ఉంది. 130 సం.ల సుదీర్గ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనే మేము మా ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తున్నాము. కనుక దానిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయబోము. మజ్లీస్ పార్టీ మాకు మిత్రపక్షం మాత్రమే. దానితో కలిసి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదు.

రాజకీయాలలో ప్రత్యర్దులే తప్ప శత్రువులు ఉండరని నేను భావిస్తున్నాను. కేంద్రప్రభుత్వంతో మాకు ఎటువంటి విభేదాలు లేవు. ఒక రాజకీయ పార్టీగా సైద్దాంతికంగా కొన్ని అంశాలలో కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకించడం సహజం. సీఏఏను వ్యతిరేకించడం కూడా అటువంటిదే. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై ఎటువంటి విధానం అవలంభించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించుకొని నిర్ణయించుకొంటాము. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి ప్రాతిపదికగా కలిసిపనిచేయాలి తప్ప ప్రతీదానిని  రాజకీయకోణంలో చూడటం సరికాదని భావిస్తున్నాను. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం సహాయసహకారాలు అందజేస్తేనే 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి భారత్‌ ఎదగగలదు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిపధంలో దూసుకుపోతూనే ఉంటుంది. హైదరాబాద్‌ విశ్వనగరంగా ఆవిర్భవించడం తధ్యం,” అని అన్నారు