అధికారుల అలసత్వంతో సరళాసాగర్ ప్రాజెక్టుకు గండి

వనపర్తి జిల్లాలోని మదనపురం మండలంలో గల సరళాసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం గండి పడింది. ఏకంగా 100 మీటర్ల వెడల్పున కరకట్టకు గండి పడటంతో ప్రాజెక్టులో నీరు అంతా వృధాగా పోయింది. అధికారుల అలసత్వం కారణంగానే ఈ ప్రాజెక్టుకు గండిపడినట్లు స్థానికులు చెపుతున్నారు. ఈ ప్రాజెక్టు కింద 12 గ్రామాలలో 4,185 ఎకరాలకు నీరు అందుతోంది. అలాగే అనేకమంది మత్స్యకారులు కూడా ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. 

ఈ ప్రాజెక్టును వనపర్తి చివరి సంస్థానాదీశులైన రాజా రామేశ్వర్ రావు తన తల్లిగారు సరళాదేవి పేరిట 1959లో నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రాజెక్టులోకి స్థాయికి మించి నీరు చేరినట్లయితే గాలి ఒత్తిడితో క్రస్ట్ గేట్లు వాటంతట అవే తెరుచుకొంటాయి. మళ్ళీ నీటిమట్టం తగ్గగానే గేట్లు మూసుకొంటాయి. దీనిని ‘ఆటో సైఫన్’ మెకానిజం అంటారు. యావత్ దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఇటువంటి ప్రాజెక్టు మరొకటి లేదు కనుక ఇది చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఇటువంటి అరుదైన ప్రాజెక్టు నిర్వహణలో అధికారుల అలసత్వం కారణంగా శిధిలావస్థకు చేరుకొంటోంది. ఆటో సైఫన్ మెకానిజం ఉన్నప్పటికీ గేట్లకు ఎప్పటికప్పుడు మరమత్తులు చేయకపోవడంతో అది సరిగ్గా పనిచేయడం లేదు. ఇప్పుడు ప్రాజెక్టుకు ఏకంగా గండి పడింది. కనీసం ఇప్పటికైనా అధికారులు వెంటనే గండిపూడ్చి ప్రాజెక్టుకు అవసరమైన మరమత్తులు చేయాలని మదనపురం మండల ప్రజలు కోరుతున్నారు.