త్రివిద దళాలకు చీఫ్‌గా బిపిన్ రావత్

భారత్ ఆర్మీ చీఫ్‌గా నేడు పదవీ విరమణ చేస్తున్న బిపిన్‌ రావత్‌ను కేంద్రప్రభుత్వం త్రివిద దళాలకు చీఫ్‌గా నియమించింది. త్రివిద దళాలు దేనికవి చాలా సమర్ధమైనవే అయినప్పటికీ కార్గిల్ యుద్ధ సమయంలో వాటి మద్య సమన్వయలోపం బయటపడింది. అయితే అది పూర్తిస్థాయి యుద్దంగా మారలేదు కనుక ఈ సమస్య వలన భారత్‌ పెద్దగా నష్టపోలేదు. నిజానికి 20 ఏళ్ళ క్రితమే ఈ సమస్యను గుర్తించినప్పటికీ అధికారంలో ఉన్నవారు నిర్ణయం తీసుకోకపోవడంతో అది అలాగే ఉండిపోయింది.

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రధాని నరేంద్రమోడీ త్రివిద దళాలను సమన్వయ పరిచేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిలటరీ ఎఫైర్స్‌(డీఎంఏ) అనే వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి త్రివిద దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్) అనే కొత్త పదవిని సృష్టించి బిపిన్‌ రావత్‌ను నియమించింది. ఆయన నేటి నుంచే సిడిఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనకు త్రివిదదళాధిపతులతో సమానమైన హోదా, జీతభత్యాలు, సౌకర్యాలు పొందుతారు.  సిడిఎస్ రక్షణమంత్రికి సలహాదారుగా వ్యవహరిస్తారు. త్రివిద దళాలకు అవసరమైన ఆయుధాలు, పరికరాలు వగైరాలు కొనుగోలు చేసే కమిటీలో కూడా సిడిఎస్ సభ్యునిగా ఉంటారు. అలాగే అణుకమాండింగ్ ఆధారిటీకి మిలటరీ సలహాదారుగా కూడా ఉంటారు. భారత్‌ ఆర్మీ, నేవీ, వాయుసేనల ప్రధానకార్యాలయాలు డీఎంఏలోనే ఉంటాయి. ఆ డిఎంఏకి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. ఆయన ప్రధాన భాధ్యత త్రివిద దళాల మద్య సమన్వయం పెంచడమే కనుక త్రివిద దళాలలో దేనీకీ ఆదేశాలు ఇచ్చే అధికారం ఆయనకు ఉండదు.