టిడిపి నేత రాయపాటి ఇళ్ళలో సిబిఐ సోదాలు

మాజీ ఎంపీ, టిడిపి నేత రాయపాటి సాంబశివరావు ఇళ్ళు, కార్యాలయాలలో సిబిఐ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఒకేసారి బెంగళూరు, హైదరాబాద్‌, గుంటూరు నగరాలలో ఆయనకు చెందిన ఇళ్ళు, కార్యాలయాలలో  సిబిఐ బృందాలు సోదాలు ప్రారంభించాయి. అలాగే దశాబ్ధాలుగా పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తూ వేలకోట్లు ఆర్జించిన ఆయనకు చెందిన ట్రాన్స్‌టాయ్ కంపెనీ కార్యాలయంలో కూడా సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. బ్యాంకు రుణాలు ఎగవేతకేసులో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. గుంటూరులో ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరొందిన రాయపాటి సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నంతకాలం వరుసగా ఎంపీ పదవి పొందుతుండేవారు. దానితో పాటు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు ఎప్పుడూ ఆయన చేతిలోనే ఉండేవి.

రాష్ట్ర విభజన జరిగి ఏపీలో టిడిపి అధికరంలోకి రాబోతోందని గ్రహించగానే ఆ పార్టీలోకి మారిపోయి పోలవరం కాంట్రాక్ట్ చేజారిపోకుండా కాపాడుకొనే ప్రయత్నం చేశారు. టిడిపి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావడంతో దానిలోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు కానీ పోలవరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జగన్ ప్రభుత్వం విచారణ జరిపించాలని నిర్ణయించినందున ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించిందని ఊహాగానాలు వినిపించాయి.

కనుక బిజెపిలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతలోనే సిబిఐ దాడులు జరుగడంతో బిజెపి గేట్లు కూడా మూసుకుపోయినట్లే భావించవచ్చు. కనుక ఈ సమస్య నుంచి రాయపాటి ఏవిధంగా బయటపడతారో చూడాలి.