
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించాలనుకొంటే పోలీసులు అనుమతించలేదు. దాంతో కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లోనే సత్యాగ్రహదీక్ష చేయాలనుకొన్నారు. కానీ దానికీ అనుమతి లేదంటూ పోలీసులు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిపి అంజనీ కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“అంజనీ కుమార్ తెరాస తొత్తులాగ వ్యవహరిస్తున్నారు. గాంధీభవన్‌లో దీక్ష చేసుకొంటే దానికీ ఆయన అనుమతి తీసుకోవాలా? వందల మంది పోలీసులను వెంటేసుకొని గాంధీభవన్‌లోకి ప్రవేశించి కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి ఆయనకు ఏమి అధికారం ఉంది? అంజనీకుమార్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమి చేశారో ఆయన భాగోతం అంతా నాకు తెలుసు. రేపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆయనపై ఫిర్యాదు చేసి ఆ చిట్టా అంతా ఆమెకు ఇస్తాము,” అని అన్నారు.
సిపి అంజనీ కుమార్ ప్రభుత్వాదేశానుసారమే వ్యవహరించారు తప్ప ఆయన సొంతంగా తీసుకొన్న నిర్ణయం కాదని అందరికీ తెలుసు. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే అంజనీ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశానుసారమే వ్యవహరించేవారు కదా? కనుక ప్రభుత్వాదేశానుసారం పనిచేసే అధికారులను రాజకీయ నేతలు నిందించడం తగదు.