
మహారాష్ట్రలో థానే జిల్లాలో భయందర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సుమారు 100 మందికిపైగా మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. వారందరికీ జిల్లా ఎస్పీ సంజయ్ పాటిల్ ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇచ్చారు. అందరూ తక్షణమే భయందర్ పోలీస్‌స్టేషన్‌లో రిపోర్ట్ చేయవలసిందిగా సందేశాలు పంపించారు. దాంతో వారందరూ ఏమైందో ఏమో అనుకొంటూ హడావుడిగా తయారై డ్యూటీకి వచ్చేశారు. అయితే పోలీస్‌స్టేషన్ చేరుకొనేసరికి అక్కడి ఏర్పాట్లు చూసి వారు ఆశ్చర్యపోయారు. వారందరికీ ఆయన షడ్రషోపేతమైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అది చూసి మహిళా పోలీసులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. భోజనాలు పూర్తి చేసిన తరువాత ఎక్కడ డ్యూటీ వేస్తారో అని అందరూ ఎదురుచూస్తుంటే అందరినీ ఆయన వ్యానులలో ఎక్కించి సినిమా ధియేటరుకు పంపించారు. అక్కడ డ్యూటీ చేయాలేమో అనుకొంటే అందరూ హాయిగా సినిమా చూసి రమ్మనమని చెప్పడంతో వారి ఆనందానికి అంతే లేదు. మహిళలు, పిల్లలపై సమాజంలో జరుగుతున్నా అకృత్యాలు, వారి అక్రమ రవాణాపై ఒక మహిళా పోలీస్ అధికారిణి (రాణీ ముఖర్జీ) చేసిన పోరాటమే ఆ సినిమా. దానిపేరు మర్ధాని-2. ఆ సినిమా చూసిన మహిళా పోలీసులకు అది ఎంతో ప్రేరణ కల్పిస్తుంది కూడా. అందుకే...రోజూ ఇంటి పనులు చక్కబెట్టుకొని వచ్చి ఎంతో సమర్ధంగా డ్యూటీలు కూడా చేస్తున్న మహిళా పోలీసులకు ఆటవిడుపుగా ఈ సినిమాకు పంపించినట్లు ఎస్పీ సంజయ్ పాటిల్ చెప్పారు.