
ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ నిజామాబాద్‌లో మజ్లీస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరూ కలిసి దేశసమగ్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రప్రభుత్వం దేశహితం కోసం చేస్తున్న పనులను వారు వ్యతిరేకిస్తుండటం చాలా బాధాకరం. పైగా నిజామాబాద్ సభకు కాంగ్రెస్, వామపక్షాలను కూడా ఆహ్వానించమని సలహా ఇచ్చారట. ప్రజాసమస్యలపై చర్చించడానికి తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్షాలు కోరితే అపాయింట్మెంట్ ఇవ్వని సిఎం కేసీఆర్, రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ముస్లిం ప్రతినిధులతో 3 గంటలు సమావేశమవడాన్ని ఏమనుకోవాలి? తెరాస, మజ్లీస్ పార్టీలు రెండూ కలిసి సీఏఏ గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలలో గందరగోళం, భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లతో దేశంలో ముస్లింలకు నష్టం జరుగుతుందని మజ్లీస్ నేతలు వితండవాదన చేస్తుంటే వారికి కేసీఆర్ మద్దతు పలుకుతున్నారు. వాటి వలన ముస్లింలకు నష్టం జరుగుతుందని ఎవరైనా నిరూపించగలరా?నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాను. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై బహిరంగచర్చకు నేను సిద్దం. వారు సిద్దమేనా?,” అని సవాలు విసిరారు.