
శుక్రవారం రాత్రి నిజామాబాద్‌లో ముస్లిం ఐక్యకార్యాచరణ కమిటీ అధ్వర్యంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్)లను వ్యతిరేకిస్తూ బహిరంగసభ జరిగింది. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దానిలో ప్రసంగిస్తూ, “ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లు రెండూ ఒకే నాణేనికి బొమ్మాబొరుసువంటివి. ఆ రెంటి లక్ష్యం దేశంలో ముస్లిం, క్రీస్టియన్, దళితులను మిగిలిన ప్రజల నుంచి వేరుచేసి చూపడమే. దానిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. గతంలో నిర్వహించిన ఎన్‌పీఆర్‌కి ఇప్పుడు మోడీ సర్కార్ నిర్వహించబోతున్న ఎన్‌పీఆర్‌కి చాలా తేడా ఉంది. గతంలో కేవలం జనాభా లెక్కల నిమిత్తమే దేశప్రజల వివరాలు సేకరించేవారు. కానీ ఇప్పుడు చేపట్టబోయే ఎన్‌పీఆర్‌తో మన పౌరసత్వం నిరూపించుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతాయి. దేశస్వాతంత్ర్యం కోసం ఎందరో ముస్లింలు పోరాడారు. కానీ ఇప్పుడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ చనిపోయే మనం మనదేశంలోనే పౌరులమని నిరూపించుకోవలసిన దౌర్భాగ్యం పట్టింది. రాష్ట్రంలో చాలామంది వద్ద జనన దృవీకరణ పత్రాలు లేవు. కనుక వారందరూ ఈ దేశం పౌరులు కారని అనగలమా?
ప్రధాని నరేంద్రమోడీ, అమిషాలు వీటి గురించి పచ్చి అబద్దాలు చెపుతూ దేశప్రజలను మభ్యపెడుతున్నారు. వారిరువురూ ఆర్‌ఎస్ఎస్ విధానాలను దేశప్రజలపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. గాంధీజీ, అంబేడ్కర్ ఆశయాలు, సిద్దాంతాలకు విరుద్దంగా దేశప్రజల మద్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. ఏకంగా రాజ్యాంగాన్నే మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను దేశంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా మోడీ సర్కార్ ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను అమలుచేసేందుకే సిద్దం అవుతోంది. అందుకే మనమూ పోరాడవలసి వస్తోంది.
ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్ ఇద్దరూ హిందువులే కానీ వారిద్దరిలో చాలా తేడా ఉంది. ప్రధాని మోడీ ‘సబ్ కా సాత్... సబ్ కా వికాస్’ అంటూనే హిందుత్వ అజెండాతో దేశప్రజల మద్య చిచ్చు పెడుతుంటే, సిఎం కేసీఆర్ లౌకికవాదానికి కట్టుబడి అన్ని కులమతాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతుంటారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై మనం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని అడుగగా అంతకు మించి చేద్దామని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ముస్లింల కోసం పోరాడేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఇక జీవితాంతం తెరాసకు మజ్లీస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ నేతలను మన ఈ సభలో పాల్గొనాలని ఆహ్వానించినా స్పందించలేదు,” అని అన్నారు.