
తెరాసలో, తెలంగాణ ప్రభుత్వంలో నెంబర్: 2 స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు సిఎం కేసీఆర్ సిద్దమవుతున్నారా?అంటే అవుననే అనిపిస్తుంది ఇవాళ్ళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాటలు విన్నప్పుడు.
ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ తరువాత అంతటి ప్రజాధారణ, నమ్మకమూ, ముక్కుసూటితనమూ, చెప్పింది చెప్పినట్లు చేసే గుణమూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన అన్నీ కేటీఆర్‌కే ఉన్నాయి. కనుక సహజంగానే అందరూ కేసీఆర్ తరువాత కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని అనుకొంటారు.
క్లాసులో ఫస్ట్ వచ్చినాయన ఉంటాడు. సెకండ్ వచ్చినాయన ఉంటాడు. అప్పుడు ఫస్ట్ వచ్చినాయన తరువాత ఎవరూ అంటే సెకండ్ వచ్చినాయననే అందరూ చూపిస్తారు తప్ప వాళ్ళ పేపర్లలలో చూసి కాపీ కొట్టి రాసినోళ్ళ గురించి ఎవరూ చెప్పుకోరు కదా. అలాగే కేసీఆర్ తరువాత ఎవరంటే అందరూ కేటీఆర్ అని అనుకోవడం సహజం. మరో పదేళ్ళో..ఐదేళ్ళో...ఎప్పుడైనా సిఎం కేసీఆర్ తరువాత రాష్ట్రానికి నాయకత్వం వహించి ముందుకు నడిపించేది కేటీఆరే తప్ప మరొకరు కారు.
విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు కూడా సిఎం కేసీఆర్‌ను కలిసిన తరువాత కేటీఆర్‌నే కలుస్తుంటారు. ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి చూపించారు..ఆయనకు అంత తెలివితేటలు, ముందుచూపు ఉన్నాయని వారు భావిస్తున్నారు కనుకనే.
కేసీఆర్ ఏదో రాజకీయాలు చేయడానికి రాలేదు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్ష చేసినప్పటి నుంచి కేటీఆర్ ఆయన వెంటే ఉన్నారు. ఒక సామాన్య కార్యకర్తలాగా తెలంగాణ కోసం పోరాడారు. ఎవరైనా ఈర్ష్యాద్వేషాలున్నవారు ఏదో మాట్లాడుతారు కానీ రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా కేసీఆర్ తరువాత కేటీఆర్ అని చెపుతాడు. కేటీఆర్ రాష్ట్రానికి నాయకత్వం వహించి ముందుకు నడిపించాలని ప్రజలందరూ కోరుకొంటున్నారు. ప్రజల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత మాపై ఉంది. కానీ పార్టీ ఏవిధంగా నిర్ణయిస్తే దానికి అందరూ కట్టుబడి ఉంటాము,” అని అన్నారు.