
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడి తెరాస అధికారంలో వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ ఎంతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడక మునుపు హైదరాబాద్లో పరిస్థితులు ఏవిధంగా ఉండేవి? ఇప్పుడు ఏవిధంగా ఉన్నాయో కాంగ్రెస్, బిజెపి నేతల కళ్ళకు కనబడటం లేదా? సీఏఏ, ఎన్నార్సీలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చాలా ప్రశాంత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండటం కాంగ్రెస్, బిజెపి నేతలకు ఇష్టం లేదా?
మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందడానికి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో కాంగ్రెస్, బిజెపిలు మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఆ రెండు పార్టీలకు కులమతాల చిచ్చు రగిలించడమో లేదా ఏదో ఓ సెంటిమెంటును రెచ్చగొట్టడం దూరాలవాటుగా మారిపోయింది.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను కేంద్రప్రభుత్వం గుర్తించి అవార్డులిస్తున్నా రాష్ట్ర బిజెపి నేతల కళ్ళకు అవేమీ కనబడవా? రాష్ట్ర బిజెపి నేతలు తెలంగాణ రాష్ట్రం కోసం డిల్లీలో ఏమీ మాట్లాడలేరు కానీ రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తుంటారు. బిజెపి నేతలకు దమ్ముంటే తమ అధిష్టానంతో మాట్లాడి సమ్మక్క సారలమ్మ పండుగకు జాతీయ పండుగ హోదా కల్పించాలి.
తెరాస లౌకికవాదానికి కట్టుబడి ఉన్న పార్టీ కనుక రాష్ట్ర ప్రభుత్వమే అన్ని కులమతాల పండుగలను ఘనంగా నిర్వహిస్తోంది. అన్ని కులమతాలకు చెందినవారిని సమానంగా ఆదరిస్తోంది. అందుకే యావత్ ప్రపంచం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోంది. తెలంగాణ సమాజం సిఎం కేసీఆర్వైపు, తెలంగాణ యువత యువనాయకుడు కేటీఆర్వైపు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో తెరాస అఖండ విజయం సాధించడం ఖాయం. అది గ్రహించే కాంగ్రెస్, బిజెపి నేతలకు భయం పుట్టుకొంది,” అని అన్నారు.