
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ మజ్లీస్ అధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లో బారీ బహిరంగసభ జరుగబోతోంది. ఈ సభకు సిఎం కేసీఆర్ కూడా వచ్చే అవకాశం ఉందని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.
ఈ పరిణామాలపై నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందిస్తూ, “త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని సిఎం కేసీఆర్-అసదుద్దీన్ ఓవైసీలు సీఏఏ, ఎన్నార్సీల పేరుతో ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారు. అందుకే మజ్లీస్ పార్టీ రేపు నిజామాబాద్‌లో బహిరంగసభ నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకొంటామంటే అనుమతించని తెరాస సర్కార్, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు మజ్లీస్ పార్టీని ఏవిధంగా అనుమతిస్తోంది? ఓవైసీల చేతిలో సిఎం కేసీఆర్ కీలుబొమ్మగా మారి అతను అడమన్నట్లు ఆడుతున్నారు.అసలు ఎనార్సీపై కేంద్రప్రభుత్వం ఇంకా ప్రకటన చేయకమునుపే తెరాస, మజ్లీస్ పార్టీలు ఎందుకు హడావుడి చేస్తున్నాయి? మున్సిపల్ ఎన్నికల కోసమే కదా? ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలు చిచ్చుపెడుతున్నాయి,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.