.jpg)
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ అవడంతో మళ్ళీ కాంగ్రెస్, తెరాస నేతల మద్య మాటల యుద్ధం మొదలైంది. వార్డుల రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పు పట్టి దీనిపై హైకోర్టుకు వెళతామని హెచ్చరించడంతో ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతున్న కాంగ్రెస్ నేతలు ఈవంకతో వాటిని అడ్డుకోవాలనుకొంటున్నారని తెరాస ఆరోపించింది. తెరాస చేసిన ఈ వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, కాంగ్రెస్ నేతలు ఎవరూ ఎన్నికలకు భయపడరు. ఎన్నికలలో పోటీ చేసేందుకు పోటీలు పడుతుంటారు. మున్సిపల్ ఎన్నికలకు కూడా మేము సిద్దంగానే ఉన్నాము.
అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి వార్డుల రిజర్వేషన్లు ప్రకటించకపోవడంతో అభ్యర్ధులను ఖరారు చేసుకోవడానికి తగినంత సమయం ఉందని మేము చెపుతున్నాము. అయినా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఇంకా వార్డుల రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎందుకు దాచిపెడుతున్నారు?జనవరి 6న వార్డుల రిజర్వేషన్లు ప్రకటించి 8 నుంచి నామినేషన్లు వేసుకోవాలంటే ఎలా? ఇది మా ఒక్క పార్టీ సమస్యే కాదు అన్ని పార్టీలది. కానీ తెరాస నేతలు ఇది తెలియనట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ల ప్రకటనతో మాకు సంబందంలేదని ఎన్నికల సంఘం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది,” అని అన్నారు.