బయోడైవర్సిటీ వంతెన త్వరలో పునఃప్రారంభం కానుంది. దానిని ప్రారంభించిన 20 రోజుల వ్యవధిలో వరుసగా రెండు ప్రమాదాలు జరిగి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో తాత్కాలికంగా మూసివేసి, దానిపై ప్రమాదాలు జరగుతుండటానికి కారణాలు తెలుసుకొనేందుకు జీహెచ్‌ఎంసీ నిపుణుల కమిటీని వేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ సూచనల మేరకు వంతెనపై ప్రమాదాల నివారణకు జీహెచ్‌ఎంసీ పలుచర్యలు చేపట్టింది. ఆ పనులన్నీ పూర్తిచేసి బయోడైవర్సిటీ వంతెనను మళ్ళీ జనవరి మొదటివారంలోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంగా పెట్టుకొని జీహెచ్‌ఎంసీ పనిచేస్తోంది.
బయోడైవర్సిటీ వంతెనపై వాహనాలు గంటకు 40కిమీ వేగంతో మాత్రమే ప్రయాణించవలసి ఉండగా 60-100 కిమీ వేగంతో వాహనాలు దూసుకుపోతున్నట్లు నిపుణుల కమిటీ గుర్తించింది. కనుక వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు వంతెనపై ప్రతీ 50-100 మీటర్ల దూరంలో సుమారు అంగుళం ఎత్తుండే రబ్బరుతో తయారు చేసిన రంబుల్ స్ట్రిప్స్ (స్పీడ్ బ్రేకర్స్) ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే వంతెనపై ప్రమాదకరమైన మలుపులు ఉన్న చోట ప్రహారీగోడ (క్రాష్ బ్యారియర్) ప్రస్తుతం ఒక మీటరు ఎత్తు ఉండగా దానిని మరో ఒకటిన్నర మీటర్లు పెంచుతున్నారు. తద్వారా మలుపుల వద్ద ఒకవేళ వాహనాలు అదుపు తప్పినప్పటికీ క్రిందపడిపోకుండా వంతెనపైనే నిలిచిపోతాయి. వంతెనపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు నగర సౌందర్యం ఆస్వాదిస్తూ వేగంగా వాహనాలు నడుపుతున్నందున కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించడంతో మలుపుల వద్ద ప్రహారీ గోడ ఎత్తు పెంచడం ద్వారా ఆ సమస్యను కూడా నివారించవచ్చని కమిటీ సూచించింది. అలాగే వంతెనపైకి ప్రవేశించినప్పటి నుంచి దిగేవరకు ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్, మలుపులను సూచించే నియాన్ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
ఖాజాగూడ నుంచి బయలుదేరి బయోడైవర్సిటీ వైపు వాహనాలు దిగగానే ‘ఎట్ గ్రేడ్ జంక్షన్’లోకి ప్రవేశిస్తాయి. అక్కడ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక ఎట్ గ్రేడ్ జంక్షన్‌లోకి ఏ లేన్‌లోకి ప్రవేశించాలో సూచిస్తూ వంతెనపై సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎట్ గ్రేడ్ జంక్షన్ వద్ద కూడా ‘వంతెనపై నుంచి వాహనాలు వస్తుంటాయి.. అప్రమత్తంగా ఉండండి’ అంటూ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ వారం రోజులలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. కనుక జనవరి మొదటివారంలో బయోడైవర్సిటీ వంతెన మళ్ళీ పునఃప్రారంభం కావచ్చు.