తెలంగాణ ఎప్పటికీ లౌకికవాద రాష్ట్రమే: కేసీఆర్‌

క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎం కేసీఆర్‌ నిన్న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ లౌకికవాద రాష్ట్రంగానే ఉంటుంది. ఇస్లామిక్ దేశాలకు వెళితే అక్కడ వారి మతానికి చెందిన పండుగలే జరుగుతుంటాయి. అదే క్రీస్టియన్ మతాన్ని పాటించే దేశాలకు వెళితే అక్కడ కూడా వారి మతానికి చెందిన పండుగలే జరుగుతుంటాయి. కానీ మన దేశంలో మాత్రం ఏడాది పొడవునా అన్ని మతాలకు చెందిన పండుగలు జరుపుకొంటుంటాము. ఆ స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా నూటికి నూరు శాతం లౌకికవాదం పాటిస్తూ అన్ని మతాలకు చెందిన పండుగలు నిర్వహించుకొంటున్నాము. ఎన్ని సమస్యలు, సవాళ్ళు ఎదురైనప్పటికీ రాష్ట్రంలో పరమత సహనం, సోదరభావం కాపాడుకొంటూ అన్ని మతాలవారు కలిసిమెలిసి జీవిస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాగే హాయిగా జీవించేలా ప్రభుత్వం లౌకికవాదానికి కట్టుబడి ఉంటుంది,” అని అన్నారు.